కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్ ప్రావీణ్యను కలసి పలు సమస్యలను విన్నవించారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఎన్నికలకుముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అవే భూములను టీజీఐఐసీ పేరుతో లాక్కొంటుందన్నారు. కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా భూముల కేటాయింపులు జరుగుతున్నాయని ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో గ్రామాల అభివృద్ధి, అవసరాలకు భూములు లేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిమ్నాపూర్ గ్రామ ప్రజల భూ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. సైదాపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కంది మండలం బేగంపేట గ్రామంలో వాటర్‌ట్యాంక్ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
కొండాపూర్(సంగారెడ్డి)/సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి వైపు పయనిస్తాయని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గంగారంలో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి భూమి పూజతోపాటు నూతన బోర్ మోటారు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలోనే 200 యూనిట్‌లలోపు ఉచిత విద్యుత్‌తోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నట్లు గుర్తు చేశారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రేషన్ కార్డుల ద్వారా ఉచితం సన్న బియ్యం వస్తున్నాయా లేదా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అలివేణి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సర్పంచ్‌లు అనిల్‌కుమార్ నాయకులు బలవంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సింహులు, ప్రవీణ్‌కుమార్, మల్లారెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


