చిన్నశంకరంపేట(మెదక్): ఆడుతూ పాడుతూ అల్లరి చేసిన చిన్నారి క్షణాల్లోనే నీటిబకెట్‌లో మునిగి మృత్యువాత పడింది. ఈ హృదయవిదారక సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరా లు ఇలా... మండలంలోని టీ.మాందాపూర్ రాంజీతండాకు చెందిన మాలోత్ ప్రసాద్, తిరుమల దంపతుల కూతురు ప్రణయశ్రీ(18 నెలల ) ఇంటి ముందు ఆడుకుంటూ నీటిబకెట్‌లో పడింది. తల్లిదండ్రులు గమనించి పాపను బయటకు తీసేలోపే ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మూడు ఇసుక లారీల పట్టివేత
న్యాల్‌కల్(జహీరాబాద్): అక్రమంగా ఇసుకను కర్నాటక ప్రాంతానికి తరలిస్తున్న మూడు లారీలను శుక్రవారం హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... ఎప్పటిలాగే ఉదయం రాష్ట్ర సరిహద్దు వద్ద ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి కర్నాటక వైపు వెళ్తున్న మూడు ఇసుక లారీలను తనిఖీ చేశారు. కరీంనగర్ నుంచి వస్తున్న ఈ లారీల్లో రెండు ఇసుకు లారీలు జహీరాబాద్‌కు, మరో లారీ గణేశ్‌పూర్ వరకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మూడు ఇసుక లారీలు కర్నాటక ప్రాంతానికి వెళ్తున్నాయి. లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. అనుమతులు లేకుండా కర్నాటక ప్రాంతానికి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


