మెదక్‌జోన్: ఈనెల 6న యువతీ, యువకులకు తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కప్ అండర్ –20 అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఈ పోటీలు ప్రారంభించనున్నారు. ఇందులో ప్రధానంగా రన్స్, త్రోబాల్, జేమ్స్ విభాగాల్లో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి మెమో తీసుకురావాలని సూచించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 11, 12వ, తేదీల్లో వరంగల్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. వివరాలకు 99630 05540 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
నిలిచిన తాగునీటి సరఫరా
నారాయణఖేడ్: ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మనూరు మండలం బోరంచ ఎన్‌ఏపీ సెగ్మెంట్‌లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఖేడ్, మనూరు మండలంలోని పలు గ్రామాలకు, శుక్రవారం ఖేడ్ మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అసలే వేసవికాలం కావడం, నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో సమ్మె ఎన్నిరోజులు కొనసాగుతుంది? నీటి సరఫరా ఎన్నిరోజులు నిలిచిపోతుందోనన్న ఆందోళన జనాల్లో నెలకొంది. సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వం బకాయి వేతనాలు చెల్లించేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.
పోలీస్‌స్టేషన్‌లో
పాము కలకలం
జోగిపేట(అందోల్): జోగిపేట పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం పాము (తాడి జెర్రి) కలకలం సృష్టించింది. మధ్యాహ్న సమయంలో ప్రధాన డోర్ వద్దకు వెళ్తుండగా స్టేషన్‌కు వచ్చిన వారు గమనించి కట్టెతో కొట్టి చంపారు. స్టేషన్‌లో ఏఎస్‌ఐ అంజయ్యతో పాటు సిబ్బంది కార్యాలయంలో ఉండగా, ప్రధాన ద్వారం వద్ద మహిళా కానిస్టేబుల్, ఇతర మహిళలు మాట్లాడుతుండగా పాము లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. స్టేషన్‌కు వెనక భాగంలో పిచ్చి మొక్కలు, వాహనాలు పేరుకుపోవడంతోనే పాములు వస్తున్నట్లు తెలుస్తుంది.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి..
– కాపర్‌వైరు చోరీ
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని వల్లంపట్లలోని వ్యవసాయ బావి వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైరును ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన కాపర్ విలువ సుమారు రూ.50వేలు ఉంటుంది. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ మహ్మద్ ఆసిఫ్‌తో పాటు క్లూస్‌టీం సభ్యులు పరిశీలించారు. విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం
చిన్నశంకరంపేట(మెదక్): అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవించింది. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. శుక్రవారం సంగాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల ప్రవళిక పురిటినొప్పులతో బాధపడుతుండటంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. చేగుంటకు చెందిన అంబులెన్స్ రాగా కుటుంబ సభ్యులు, ఆశావర్కర్‌తో కలిసి మెదక్‌కు బయలుదేరారు. ఆస్పత్రికి చేరకముందే గర్భిణికి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ వినోద వాహనంలోనే సాధారణ ప్రసవం చేశారు. పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా వారిని మెదక్ మాతా శిశువు ఆస్పత్రిలో చేర్చారు.


