బైక్‌ అదుపుతప్పి.. స్తంభం వైరును ఢీకొట్టి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి.. స్తంభం వైరును ఢీకొట్టి

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

యువకుడు మృతి

కౌడిపల్లి(నర్సాపూర్‌): బైక్‌ అదుపుతప్పి స్తంభం వైరును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. శుక్రవారం ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని వెల్మకన్న గ్రామానికి చెందిన కర్రోల్ల సుమంత్‌కుమార్‌(24) నర్సాపూర్‌లో క్యాటరింగ్‌ పనిచేస్తున్నాడు. గురువారం పని ఉండటంతో నర్సాపూర్‌ వెళ్లి తిరిగి శుక్రవారం తన బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. కాగా మండలంలోని రాయిలాపూర్‌గేట్‌ సమీపంలో 765డి జాతీయ రహదారిపై అతని బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభం వైర్‌(బిర్రువైర్‌)ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. దీంతో అతని కాలువిరగగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా రెండేళ్ల క్రితం అతని తండ్రి వెంకట్రాములు మృతి చెందాడు. కుటుంబానికి అండగా ఉండే కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

భవనం పైనుంచి పడి పెయింటర్‌..

సంగారెడ్డి క్రైమ్‌: ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పైనుంచి పడి పెయింటర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జనార్దన్‌ నాయక్‌ (40) అనే వ్యక్తి శుక్రవారం పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో పెయింటింగ్‌ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పైనుంచి పడి మృతి చెందాడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో అతడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయమై పట్టణ పోలీసులను అడుగగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

మృత శిశువు లభ్యం

సిద్దిపేటకమాన్‌: అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువు మృతదేహమై కనిపించాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని రిలయన్స్‌ మార్ట్‌ వెనకాల కాలనీలో ఇళ్ల మధ్య ఓ భవన నిర్మాణం కోసం పిల్లర్‌ గుంతలు తీసి ఉంచారు. అప్పుడే జన్మించిన మగ మృత శిశువును మురుగు కాలువ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృత శిశువును ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. శిశువును వదిలించుకోవడానికి ఎవరైనా పడేసి వెళ్లారా? లేదా వదిలేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శిశువుకు బొడ్డు తాడు కూడా అలానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

పరిశ్రమ బస్సు ఢీకొని విద్యార్థి..

పటాన్‌చెరు టౌన్‌: బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారానికి చెందిన రాజేశ్‌ (17) ఇస్మాయిల్‌ఖాన్‌ పేట్‌ రహదారిలో ఉన్న దేవాలయం వద్ద వేడుకకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ప్రైవేటు పరిశ్రమకు చెందిన బస్సు అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యార్థికి తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement