● కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సస్యశ్యామలం ● రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్‌లో మనమే అగ్రగామి ● మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటజోన్: ఒకప్పుడు కరువుతో అలమటించిన సిద్దిపేట.. నేడు బీహార్, ఛత్తీస్‌గఢ్ కూలీలకు ఉపాధి చూపుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 300మందికి రూ.62 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో పల్లెల్లో గోదావరి కాల్వల వల్ల బీడు భూములు సస్యశ్యామలం అయినట్టు పేర్కొన్నారు. వేసవిలో నియోజకవర్గ పరిధిలో 85 వేల ఎకరాల్లో వరిసాగు అయిందన్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు వరి నాట్ల కోసం మన సిద్దిపేట వస్తున్నారని తెలిపారు. చిన్నకోడూర్, నంగనూర్ మండలాల్లో మిర్చి, ఆయిల్ ఫామ్ తోటలు పెద్ద ఎత్తున సాగైనట్టు తెలిపారు. వ్యవసాయ, ఐటీ, రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సీఎం సహాయ నిధి చెక్కులు మన సిద్దిపేట నుంచి పంపిణీ చేశామని, 12,857 మందికి రూ.41కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


