ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాలతో కోట్లాదిమంది కార్మికుల హక్కులను హరిస్తుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ వద్ద ధర్నా చేపట్టి, దేశవ్యాప్త నిరసనలో భాగంగా బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 29 కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. నాలుగు కోడ్‌లుగా మార్పు చేసి, ఏప్రిల్ 1 నుంచి దేశంలో ప్రవేశపెట్టడంతో 40 కోట్ల మంది కార్మికుల హక్కులకు భంగం కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకూ కార్మికులు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ పెయింట్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్ సింహారెడ్డి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీధర్, మహేశ్, భోజరాజు, వేణు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


