‘బ్యాట్’.. గుండెల్లో పరుగే!
ప్రధాన పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు
సదాశివపేట(సంగారెడ్డి): స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి బ్యాట్ గుర్తు లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యాట్ గుర్తు సదాశివపేటలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ టికెట్లు ఆశించి దక్కకపోవడంతో చాలామంది రెబల్స్‌గా బరిలోకి దిగి గట్టిపోటీనిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం రూపొందించిన గుర్తుల జాబితా నుంచి మూడు గుర్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులు ఉన్నవాటిల్లో చాలామంది బ్యాట్ గుర్తును మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. అందువల్ల 3,7,22,25,26 వార్డుల్లో బ్యాట్, 17,18వార్డుల్లో కప్ సాసర్ గుర్తులపై పోటీ చేస్తున్నా ప్రధానంగా బ్యాట్ గుర్తే ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.
ఓటుకు రూ.5 వేలు!
మంగళవారం తెల్లవారుజామునుంచి ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ప్రధాన అనుచరులు ఓటర్లకు మద్యం సీసాలు, నగదు పంపిణీలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అందజేసినట్లు సమాచారం. సదాశివపేట పట్టణంలో చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్న వార్డుల్లో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు, మిగతా వార్డుల్లో రూ.1000 నుంచి రూ.2000 వరకు నగదు పంపిణీ చేసినట్లు సమాచారం. బలహీనవర్గాలు, నిరుపేదలు, దినసరి కూలీ చేసుకునే ఓటర్లపై అభ్యర్థులు దృష్టిసారించి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓటర్లకు ముందే డబ్బులు పంపిణీ చేసిన వారు వార్డుల్లో ఇతరులెవరూ డబ్బులు పంపిణీ చేయకుండా కాపు కాసినట్లు తెలిసింది.


