ఈసారీ ఇరుకే
● పోలింగ్ కేంద్రాలుగా చిన్న చిన్న గదులు ● ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 700కు పైగా ఓటర్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా నేర్వని గుణపాఠం
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సి పాలిటీకి బుధవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరుకై న గదిలో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి మహిళలు, పురుషులు కలిపి ఒకే చిన్నగదిలో 700కు పైగా ఓటర్లతో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు ఒకే దారి గుండా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. స్థానికంగా 20 వార్డులకుగాను 32 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 16,450 మంది ఓటర్లుండగా, 8,564 మంది మహిళలు, 7,886 మంది పురుషులున్నారు. 5వ వార్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 7వ పోలింగ్ స్టేషన్‌లో 779 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే జోగిపేటలోని ఏఎంసీ బిల్డింగ్‌లో 13వ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయగా అందులో 793 మంది, అందోలులోని 6వ పోలింగ్ బూత్‌లో 766 మంది, జోగిపేటలోని ఐకేపీ భవనంలోని 3వ పోలింగ్ స్టేషన్‌లో 2వ వార్డుకు సంబంధించి 725 మంది ఓటర్లు, జోగిపేటలోని కేంద్ర ప్రాథమిక భవనంలోని ఒక చిన్న గదిలో 24వ పోలింగ్ స్టేషన్‌లోని 15వ వార్డుకు చెందిన 772 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందోలులోని ఇరుకై న పోలింగ్ కేంద్రంలో స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఎండలో బారులు తీరి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
మళ్లీ అట్టలతోనే బూత్‌ల ఏర్పాటు
ఎప్పటిలాగే పోలింగ్ బూత్‌లలో ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాటుగా ఉండేందుకు అట్టముక్కలతో ఏర్పాటు చేశారు. దానిపైనే పోలింగ్ స్టేషన్, బూత్ నంబరును ఉంచారు. ఏళ్ల తరబడి ఎన్నికల కమిషన్ పోలింగ్ కంపార్ట్‌మెంట్‌లను అట్టలతోనే ఏర్పాటు చేస్తున్నారు.


