అధికారుల నిర్లక్ష్యంపై నిరసన
రోడ్డుపై బైఠాయించిన రైతులు
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని రజాక్‌పల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... కాగా ఆదివారం రైతు ఒజ్జ పర్శరాములు తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా షాక్ తగలడంతో రెండు చేతులు, కాళ్లు కాలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేయాలని అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోలేదని రోడ్డుపై నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అధికారులకు ఎల్‌సీ ఇవ్వాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.
చెరకు లారీ బోల్తా
నారాయణఖేడ్: జాతీయ రహదారిపై చెరుకు లారీ బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం మండలంలోని జూకల్ శివారులోని డబుల్‌బెడ్రూం ఇళ్ల సముదాయం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మనూరు మండలం నుంచి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగీ చక్కర కర్మాగారానికి చెరకు లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. అందులో ఉన్న ఇద్దరు కిందకు దూకారు. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇవ్వడానికి లారీ డ్రైవర్ రోడ్డు పక్కన నిలపడానికి యత్నిస్తుండగా తిరగబడింది.
వాలీబాల్ పోటీల్లో ‘తాడ్వాయి’ సత్తా
మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రంలోని మంజీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడలు ఆదివారం రాత్రి ముగిసాయి. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తాడ్వాయి క్రీడా జట్టు ట్రోఫీతో పాటు, రూ.15 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన తీగుల్ జట్టుకు బహుమతితోపాటు, రూ.10 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వడియారం జట్టుకు బహుమతితో పాటు, రూ. 5 వేల నగదు పురస్కారం అందించారు. విజేతలకు బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట కమలాకర్‌రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చైన్నె భూపాల్ గౌడ్, మంజీర యూత్ అధ్యక్షుడు భైరయ్య, గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, టీపీటీఎఫ్ జిల్లా నాయకుడు మల్లేశం, రామచంద్రం, కుమార్, మంజీర యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మందుబాబులకు జరిమానా
సిద్దిపేటఅర్బన్ / సిద్దిపేటకమాన్ / పటాన్‌న్‌చెరు టౌన్: మందుబాబులకు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు కథనం ప్రకారం... పట్టణంలోని పొన్నాల వై జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా ఒకరికి రెండు రోజుల శిక్షతోపాటు మరో నలుగురికి రూ. 10 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అలాగే వన్‌టౌన్ పరిధిలో మద్యం తాగి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 12 మందికి కోర్టు రూ.1,17,500 జరిమాన, ఒకరికి మూడ్రోజుల జైలు శిక్ష విధించినట్లు సిద్దిపేట వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పటాన్‌్‌చెరులో పట్టుబడిన 18 మందిని సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా 10 మందికి రూ. వెయ్యి జరిమాన, మరో ఇద్దరికి రూ.1500, ఆరుగురికి రూ.2 వేల చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిరసన
అధికారుల నిర్లక్ష్యంపై నిరసన


