మంట ఆరక.. ఊపిరాడక
● అమీన్‌పూర్ డంప్‌యార్డులో ఆరని మంటలు ● పొగతో స్థానికులకు ఇబ్బందులు ● అధికారుల అలసత్వమే కారణమా !
పటాన్‌చెరు: అమీన్‌పూర్ డంప్ యార్డులో చెత్త తగలబడుతుంది. వారం రోజులుగా అక్కడ మంటలు అదుపులోకి రావడం లేదు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్వచ్ఛమైన గాలికి నోచుకోక పౌరులు ఇబ్బందుల పాలవుతున్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సర్వే నం.993లో గార్భేజ్ కలెక్షన్స్ సెంటర్ పేరిట చెత్త డంప్‌యార్డు నిర్వహిస్తున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రతిరోజు హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌కు తరలించాలి. కానీ గత ఏడాది నుంచి చెత్తను జవహర్ నగర్‌కు తరలించడం లేదు. కాగా గార్భేజ్ కలెక్షన్ సెంటర్‌కు కేటాయించిన ఐదెకరాల విస్తీర్ణంలో 20 మీటర్ల ఎత్తు చెత్త డంపు పేరుకుపోయింది. తాజాగా అందులో విష వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఆ గ్యాస్ కారణంగా మంటలు వ్యాపిస్తున్నాయి. అయితే కావాలనే అధికారులు మంటలను అదుపు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనలతో అధికారులు రెండు రోజులుగా చెత్తను జవహర్ నగర్‌కు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ డంప్ యార్డులో మంటలను మాత్రం నేటికీ అదుపులోకి తేలేదు. దీంతో పరిసర కాలనీల్లో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి తీసుకోవడం కూడా ప్రజలకు కష్టంగా మారింది. ఈ పరిస్థితి గత వారం రోజులుగా కొనసాగుతుంది. పొగ, మంటలను అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


