వలస ఓటర్లకు గాలం
● రాను పోను రవాణ చార్జీలు చెల్లిస్తామంటున్న అభ్యర్థులు
సంగారెడ్డి టౌన్/సదాశివపేట(సంగారెడ్డి) : మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్లను గాలం వేసేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం 11 మున్సిపాలిటీల్లో అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వెతుకులాట సాగిస్తున్నారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని మొత్తం ఓటర్లు 3,42,659. ఇందులో మహిళలు 1,72,521, పురుషులు 1,70,102 మంది ఉండగా 256 వార్డుల్లో 10,450 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, ఈ అభ్యర్థులందరూ వలస ఓటర్ల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలా లు, ఫోన్ నంబర్లను అభ్యర్థులు సేకరిస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డు ల్లో ఇన్‌చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్ల కోసం బంధువుల ద్వారా ఫోన్లు చేయించి ఓట్లు వేసేందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే రవాణ చార్జీలు చెల్లిస్తాం ఓటు వేసి వెళ్లాలని వేడుకుంటున్నారు. వలస ఓటర్లకు ప్రయాణ ఖర్చులతోపాటు ఓటరుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొందరు అభ్యర్థులైతే వలస ఓటర్ల కోసం బంధువుల ద్వారా ఫోన్లు చేయించి ఓట్లు వేసేందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వద్దకు తమ తమ నాయకులను పంపించి హామీలు ఇస్తూ డబ్బులు సైతం పంపిణీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


