పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే
పటాన్‌చెరు టౌన్: బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కార్మిక శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు, పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి మంత్రి వివేక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ అకౌంట్‌లో రూ.వెయ్యి కోట్ల డిపాజిట్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి కమిషన్లను దండుకుని పార్టీ పేరు మీదకు డబ్బులు మళ్లించారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితది రాజకీయ గొడవ కాదని, పదేళ్ల పాలనలో లక్షల కోట్లు దండుకుని డబ్బుల పంపకంలో వచ్చిన గొడవలతోనే విడిపోయారని తెలిపారు. కవితకు 50% వాటా అడిగితే ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి చూపించి రాబోయే రోజుల్లో రూ.2,500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పాశమైలారంతో తనకు మంచి అనుబంధం ఉందని ఇటీవలే మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శ్రీ శైలం,కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక శాఖ మంత్రి వివేక్


