మహిళలే కీ రోల్
ఓట్లు.. సీట్లు వారివే
● ప్రచారంలోనూ అతివలే.. ● మెదక్‌లో 113 మంది అభ్యర్థులు ● బరిలో 60 మంది మహిళలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా... మహిళలదే హవా కనిపిస్తోంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాత మార్చేది కూడా వారి ఓట్లే. మెదక్ మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 113 మంది పురపోరు బరిలో నిలిచారు. అందులో ఆయా పార్టీలు బలపర్చిన వారితోపాటు స్వతంత్రులు కలిపి మొత్తం 60 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ చైర్మన్ స్థానాలు వారికే కేటాయించారు. ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తుండగా, అందులో ఏ వార్డులో చూసినా ప్రచారంలో మహిళలే కనిపిస్తున్నారు.
4 మున్సిపాలిటీలు..
87,185 మంది ఓటర్లు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 87,185 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు 45,168 మంది, 42,015 మంది పురుష ఓటర్లు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. 4 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్‌లో భాగంగా మున్సిపల్ చైర్మన్ స్థానాలు మహిళలకే కేటాయించారు.
ప్రచారంలోనూ వారే..
మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులు ఉండగా ఇందులో 16 వార్డులు మహిళలకు కేటాయించారు. 32 వార్డుల్లో 113మంది బరిలో ఉండగా వారిలో స్వతంత్రులతోపాటు మొత్తం 60 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 32వ వార్డు మహిళా అభ్యర్థి ఏకగ్రీవం కాగా 15 వార్డుల్లో మొత్తం 59 మంది బరిలో ఉన్నారు. వార్డుల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలోనూ మహిళలే అత్యధికంగా ఉంటున్నారు. అభ్యర్థులు కూడా మహిళా ఓటరును ప్రసన్నం చేసుకుంటే ఓట్లన్నీ మనకే పడతాయన్న ఆలోచనతో వారినే ప్రచారానికి ఎక్కువగా పిలుస్తున్నట్లు సమాచారం.


