బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఒరిగేదేమీలేదు ● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ● గజ్వేల్‌లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
గజ్వేల్: బీజేపీకి ఓటేసి గెలిపించుకోవడం ద్వారా మున్సిపాలిటీలను బాగు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై పట్టు సాధించలేక పోతున్నారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుండబద్ధలు కొట్టిన ఆయన రాష్ట్రాన్ని ఎలా ప్రగతి పథంలో పెడతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తనకు ఆర్థిక పరిస్థితి తెలుసునని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహ రించడం వల్లే బీఆర్‌ఎస్‌ను ప్రజలు గద్దె దించారని గుర్తు చేశారు. నేటికీ ఆ పార్టీ నేతల తీరు మారటం లేదని చెప్పారు. ఇలాంటి సందర్భంలో బీజేపీకి ఓటు వేయడం ద్వారా పట్టణాల అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉన్నదని పిలుపునిచ్చారు. సర్పంచ్, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రద్దవుతాయనే భయంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


