సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
ములుగు(గజ్వేల్): సెల్‌ఫోన్‌లను అపహరించి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ములుగు ఎస్‌ఐ రఘుపతి కేసు వివరాలు వెల్లడించారు. శివ్వంపేట మండలం బిక్యా తాండాకు చెందిన దేవసోత్ చరణ్‌నాయక్, మాలోత్ సంతోష్ నాయక్, గుగులోత్ శ్రీధర్ గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా 54 సెల్‌ఫోన్‌లు దొంగిలించారు. అందులో నుంచి కొన్ని ఫోన్‌లు ఇతర రాష్ట్రాల వారికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. ఇంకా మిగిలివున్న 27 సెల్‌ఫోన్‌లను వారు నివాసముంటున్న మేడ్చల్‌లోని ఒక గదిలో బద్రపరిచారు. అందులో నుంచి ఒకటి చొప్పున విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు శనివారం 3 సెల్‌ఫోన్‌లను విక్రయించేందుకు మండలంలోని బండమైలారం గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రఘుపతి సిబ్బందితో కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.1లక్ష 23 వేలు విలువ చేసే 23 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.


