కూతురు సీమంతానికి వచ్చి..
తండ్రి మృతి
పాపన్నపేట(మెదక్): కూతురు సీమంతం కోసం వచ్చిన ఓ తండ్రి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చీకోడ్‌లో శనివారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... చీకోడ్‌కు చెందిన బోయిని సత్యనారాయణ (43) బతుకు దెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇటీవల పెద్ద కూతురు శివాని వివాహం చేశాడు. అయితే ఆమె శ్రీమంతం చేసేందుకు స్వగ్రామానికి వచ్చారు. ఘనంగా ఫంక్షన్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బహిర్భూమికి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామశివారులో వెతకగా, చెరువు వద్ద, చెప్పులు కనిపించాయి. చెరువులో వెతుకగా సత్యనారాయణ మృతదేహం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


