పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి
మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన 4 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఏఓ యూనస్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించకుండా వారితో మల్టీ పర్పస్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ పని విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు ప్రవీణ్, రాములు పాల్గొన్నారు.
ఆలయంలో దొంగల బీభత్సం
వెండి కిరీటం, బంగారం చోరీ
దుబ్బాకరూరల్: ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలోని గంభీర్‌పూర్‌లో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి దొంగలు ఆలయం తలుపులు పగులగొట్టి అందులోని 20తులాల వెండి కిరీటం, పది తులాల వెండి మాణిక్యాలు, నాలుగు గ్రాముల బంగారు పుస్తెలు, ఇత్తడి చెంబు, శఠగోపంను అపహరించారు. గౌడ సంఘం సభ్యులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు, క్లూస్ టీమ్ చేరుకుని వివరాలు సేకరించారు.
ఎలుగు బంటి దాడి
గొర్రెల కాపరికి గాయాలు
రామాయంపేట(మెదక్): మండలంలోని దంతేపల్లి గ్రామ శివారు లోని అటవీ ప్రాంతంలో శనివారం ఎలుగు బంటి గొర్ల కాపరిపై దాడి చేసి గాయపర్చింది. గొర్రెలను మేపుతున్న నక్కిర్తి సిద్ధయ్యపై పొదల చాటు నుంచి వచ్చిన ఎలుగు బంటి దాడి చేసింది. దీంతో భయాందోళన చెందిన ఆయన అరువగా, అది అడవిలోకి వెళ్లిపోయింది. గాయాలపాలైన ఆయన గ్రామంలోకి వచ్చి విషయం చెప్పాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గ్రామస్తులు మెదక్ ఆస్పత్రికి తరలించారు. అటవీ అధికారులు సంఘటనాస్థలిని సందర్శించారు. గ్రామస్తులు అటవీప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు.
15 మంది క్రీడాకారుల ఎంపిక
సంగారెడ్డి క్రైమ్: జిల్లా హెడ్ క్వార్డర్స్‌లోని ఎమ్‌ఎస్ క్రికెట్ అకాడమీలో శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి మహిళా క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి క్రికెట్ క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా క్రికెట్ లీగ్, నాక్‌ఔట్ విభాగంలో ఎంపిక చేశారు. ఉత్తమ ఆటతీరు కనబర్చిన 15 మంది కీడ్రాకారులను ఎంపిక చేసినట్లు కార్యదర్శి రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. అసోసియేషన్ కోచ్‌లు శ్రీనాథ్ రెడ్డి, కలీం, తౌహీద్, చంద్రమౌళి, అనిల్ కుమార్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పూరిగుడిసె దగ్ధం
చేగుంట(తూప్రాన్): పూరి గుడిసె దగ్ధమై రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని చిట్టోజిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎగ్గిడి నర్సింహులు వ్యవసాయ పనులు చేసుకొని పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. శనివారం కుటుంబీకులంతా వ్యవసాయ పనులకు వెళ్లగా పూరిగుడిసెలో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు రూ.5లక్షల నగదు, మూడు తులాల బంగారం, 10 తులాల వెండి, దుస్తులు, ఇతర పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు.


