పరమ పవిత్రం
పల్లెల్లో సందడి..
ధనుర్మాస వ్రతంతో
అద్భుత ఫలితాలు
ధనుర్మాసం..
● జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో పూజలు
● గ్రామాల్లో హరిదాసుల సందడి
● గోదాదేవికి పూజాకార్యక్రమాలు
దుబ్బాకటౌన్: దైవారాధనకు విశిష్ట మాసం ధనుర్మాసం. పవిత్రమైన ఈ మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరం. దక్షిణాయనంలో చివరి మాసం కూడా ఇదే. సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ మాసానికి ధనుర్మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో 30 రోజులు విశిష్ట పండుగగా ప్రజలు జరుపుకుంటారు. ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం వంటిది. ఈ మాసం అంతా దేవతలు వేకువ జామున మహావిష్ణువును, మహేశ్వరుడిని ఆరాధిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతితో ధనుర్మాసం ముగుస్తుంది.
గోదాదేవికి ప్రత్యేక పూజలు
మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి సంక్రాంతి వరకు శుభకార్యాలకు దూరంగా ఉంటారు. సంక్రాంతి వరకు గోదాదేవికి సంబంధించిన పూజలు విష్ణు ఆలయాల్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
అపర నారదులు.. హరిదాసులు
కీర్తనలు పాడుతూ నగర, గ్రామాల్లో సంచరించే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. అపరనారదులుగా పిలవబడే వీరు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. హరిదాసు ఆగమనం సంక్రాంతి సంబరాలకు సంకేతం.
వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాస పూజలు
దుబ్బాక పట్టణంలో శ్రీదేవి, భూదేవి, గోదాదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, సిద్దిపేట జిల్లాలో పలు వైష్ణవ దేవాలయాల్లో మంగళవారం ప్రారంభమైన ధనుర్మాస పూజలు జనవరి 14 వతేదీ వరకు జరగనున్నాయి.
ధనుర్మాసం నెలరోజులు వేకువజామున గ్రామాల్లో హరిదాసులు, గంగిరెద్దుల సందడి కనిపిస్తుంది. జంగమయ్య పాటలు, మేలుకొలుపు భజనలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మరో వైపు రైతులు పంట కల్లాల్లో పూజలు చేస్తారు.
సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన సమయాన్ని ధనుర్మాసమని, తిరిగి మకరరాశిలో ప్రవేశించిన సమయాన్ని మకర సంక్రమణమని పిలుస్తారు. ఈ మాసంలో దీక్ష, ధనుర్మాస వ్రతం గొప్ప ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. గోదాదేవి ఆచరించి మనకు అందించింది. అద్భుత ఫలితాలు అందించే వ్రతమే ధనుర్మాస వ్రతం.
– అచ్చి లక్ష్మీనరసింహచార్యులు, బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు, దుబ్బాక
పరమ పవిత్రం


