నిబంధనలు పాటించకుంటే..
11 నెలల్లో 3,435 పైగా కేసులు, జరిమాన విస్తృతంగా వాహన తనిఖీలు
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమాన విధిస్తున్నారు. పట్టణంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిత్యం డ్రంకెన్ డ్రైవ్‌తో పాటు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. 11 నెలల్లో సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,435 పైగా కేసులు నమోదయ్యాయి. కాగా రూ.21,25,700 జరిమాన విధించారు.
హెల్మెట్ తలకే కాదు.. కుటుంబానికి రక్షణ
రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులకు, హెల్మెట్ ధరించని వారికి ట్రాఫిక్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అయినా మారడం లేదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలు, నంబర్ ప్లేట్ లేని వాటికి, నంబర్‌ప్లేట్ కనబడకుండా మాస్కులు అడ్డంగా ఉంచేవారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులను కోర్టులో హాజరు పరుస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తుచేస్తున్నారు. ఒక చిన్న తప్పిదంతో కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుందని, హెల్మెట్ తలకు మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికే రక్షణ ఇస్తుందని అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిబ్బంది పలుచోట్ల విద్యార్థులతో కలిసి ప్లకార్డుల ప్రదర్శన చేపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, వారు వాహనం నడిపి పట్టుబడితే సంబంధిత వాహన యజమానులు/ తల్లిదండ్రులపై చట్టరీత్య చర్యలు తీసుకుంటున్నారు.
కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
2025 జనవరి నుంచి
నవంబర్ 30 వరకు..
కేసులు జరిమాన
డ్రంకెన్ డ్రైవ్ 1611 –––
మైనర్ డ్రైవింగ్ 53 26,500
ట్రిపుల్ రైడింగ్ 1771 21,25,200


