ఘనంగా ‘రాయరావు’ ఆత్మీయ సమ్మేళనం
● హాజరైన ప్రముఖులు ● పాల్గొన్న 200 మంది వంశస్తులు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో రాయరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనంలో రాయరావు వంశానికి చెందిన 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయరావు వంశస్తుల్లో ఓ కుటుంబానికి చెందిన ఆర్‌ఎస్కే భూపాలరావు, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, విశిష్ట అతిథులుగా సీనియర్ సంపాదకుడు రామచంద్ర మూర్తి, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ... నల్లవల్లి గ్రామానికి వేయ్యేళ్ల చరిత్ర ఉందని, ఆనవాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని బీరప్ప గుడి వద్ద రాష్ట్ర కూటుల కాలం పదో శతాబ్దం నాటి నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు గల రాతిపై నిలబడి నాలుగు చేతుల్లో డమరుకం, శూలం, ఖడ్గం, కపాలా పాత్ర తలపై విరి జడలు వంటిపై కపాల మాలను ధరించిన బైరవ శిల్పం చారిత్రక ప్రాధాన్యత గలదని వివరించారు. రాజారావు దేశ్ముఖులు 18వ శతాబ్దంలో నిర్మించిన కోట సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం ముందు కోనేరు శిథిలావస్థకు చేరాయని, ఈ కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉదన్నారు. అనంతరం సీనియర్ సంపాదకుడు రామచంద్ర మూర్తి మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తున్నందున రాయరావ్ వంశస్తులను అభినందించారు. సామాజిక సాహిత్య పాలన రంగాల్లో తెలంగాణ రాయరావుల ఖ్యాతిని డాక్టర్ శ్రీధర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజారావు వంశస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ‘రాయరావు’ ఆత్మీయ సమ్మేళనం


