నేటితో ప్రచారానికి తెర
నారాయణఖేడ్: చివరి విడత ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటలతో మైకులు మూగబోనున్నాయి. గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల తరపున ప్రచారం చేసే నియోజకవర్గ ముఖ్యనేతలు గ్రామాలను విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గెలుపుకోసం వ్యూహాలను అందిస్తున్నారు. చివరి రోజు ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి రోజు ప్రతీ ఓటరును కలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. నేటి సాయంత్రం 5గంటల తర్వాత ప్రచారం ఆగిపోనుండటంతో ప్రచార రథాలు, మైకులు, జెండాలను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మద్యం దుకాణాలు బంద్..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో చివరి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. సోమవారం సాయంత్రం 5గంటలకు మద్యం దుకాణాలు మూసివేసి పోలింగ్ రోజు 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మూసేసి ఉంటాయి. ఖేడ్ నియోజకవర్గంలో మండల కేంద్రాలు, గ్రామాల్లో 9 మద్యం దుకాణాలను మూసి వేయనున్నారు. ఖేడ్ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో పట్టణంలోని నాలుగు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసి ఉండటంతో మద్యం విక్రయాలు ఎక్కడ జరిగినా వెంటనే సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎకై ్సజ్, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
నేడు, రేపు మద్యం, నగదు జోరు!
ఇప్పటికే మద్యం దావత్‌లు నడుస్తుండగా చివరి రెండు రోజు మద్యం పంపిణీ చేయనున్నారు. చాలామంది అభ్యర్థులు గ్రామాల్లో అక్కడక్కడ మద్యం డంప్‌లు చేసి పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డుల వారీగా వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. కొన్ని చోట్ల నగదు పంపిణీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల పాటు మద్యం జోరుగా ఏరులై పారనుంది. గ్రామాల్లో చీఫ్ లిక్కర్ తాగేవారు కూడా బ్రాండెడ్ మద్యం అడుగుతుండటంతో అభ్యర్థులకు ఆ కంపెనీ మద్యం పంపిణీ చేయక తప్పడం లేదు.
మూడో విడతకు ఏర్పాట్లు
సాయంత్రం 5గంటల నుంచి బంద్
ఇక ప్రలోభాలతో ఓటరుకు ఎర


