వాహనం అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొట్టి
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని కోమటిబండకు చెందిన షేక్ భాస్కర్(35)కు భార్య కవితతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగు చేస్తూ భాస్కర్ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని ముట్రాజ్‌పల్లి మార్గం వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భాస్కర్ మృతితో కోమటిబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వరిస్తూ, తెలంగాణ ఉద్యమం కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొని తనదైన ముద్ర వేశాడు.
వాహనం ఢీకొని ఒకరు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లి తండా సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... తండాకు చెందిన భాస్కర్(36) పొలం దగ్గరకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన ఘటనా స్థలంలో అక్కడికక్కడే మరణించాడు.
జహీరాబాద్‌లో వృద్ధుడి మృతదేహం..
జహీరాబాద్ టౌన్ : గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పట్టణంలోని ఆదర్శనగర్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కథనం ప్రకారం... సుమారు 70 సంవత్సరాల వయసు కల్గిన వృద్ధుడు తీవ్ర చలి లేదా అనారోగ్య సమస్యల వల్ల చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అంబులెన్స్ డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి..
సంగారెడ్డి క్రైమ్: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాము నాయుడు వివరాల ప్రకారం... ఆదివారం ఉదయం 9గంటల సమయంలో కొత్త బస్టాండ్ ఎదురుగా గల గణేశ్ వైన్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ( 35–40ఏళ్లు) వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొత్త బస్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో క్లీనింగ్ పని చేసే ముత్తుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉద్యమకారుడు మృతి


