తమ్మీ.. జర వచ్చిపో..!
● వలస ఓటర్లపై అభ్యర్థుల దృష్టి
● ఫోన్ చేసి పోలింగ్‌కు రావాలని వేడుకోలు
● దావత్, రవాణా ఖర్చులు సైతం ముట్టచెబుతున్న వైనం
న్యాల్‌కల్(జహీరాబాద్): పంచాయతీ ఎన్నికల్లో వలస ఓట్లు చాలా కీలకం. దీంతో అభ్యర్థులు తమ పార్టీ మద్దతుదారులతో పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. వలస వెళ్లిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని బతిమాలుడుతున్నారు. ఓటు వేసేందుకు రావడానికి అసరమయ్యే రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా వలస ఓటర్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడత ఎన్నికలు ముగియడంతో రెండవ, మూడవ విడత ఎన్నిలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ప్రతి ఓటు కీలకం కావడంతో పాటు స్వల్ప ఓట్ల తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లపై దృష్టి సారించడంతో పాటు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లపై దృష్టి సారించారు. వారి ఓట్లను ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు వలస వెళ్లిన వారిని గుర్తించి వారు ఉండే ప్రాంతాలకు వెళుతున్నారు. రవాణా ఖర్చులతో పాటు దావత్‌లకు కొంత ముట్టజెప్పుతున్నారు. వారి ఫోన్ నంబర్లను తీసుకొని టచ్‌లో ఉంటున్నారు. రెండవ, మూడవ విడత ఎన్నికల్లో సుమారు 4లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కూడా ఉంది.


