మామను హతమార్చిన అల్లుడు
పటాన్‌చెరుటౌన్: మామను అల్లుడు హతమార్చిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. బీరంగూడ మంజీరానగర్‌కు చెందిన రామకృష్ణ చెత్త బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంజీరానగర్ కాలనీకి చెందిన చెత్త బండి నడపే చంద్రయ్య (58) కూతురు లక్ష్మితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు. అయితే మద్యానికి బానిసైన రామకృష్ణ తరచూ మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవ పడుతుండేవాడు. కూతురుతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. గమనించిన భార్య పిల్లలను తీసుకొని మూడు నెలల క్రితం తండ్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన రామకృష్ణ మామతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు చంద్రయ్యను చికిత్స కోసం బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల దాడిలో గాయపడిన రామకృష్ణ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


