సర్పంచ్ నీ ఇష్టం.. వార్డుకు నాకే ఓటేయ్
చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారాలు జోరందుకున్నాయి. పలు గ్రామాల్లో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపు సాధించాలనే లక్ష్యంతో, తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న వార్డు సభ్యులకు సైతం కొంత మేర ఖర్చు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గ్రామాల్లో ఓటర్లు వార్డు సభ్యుల అభ్యర్థులకు అనుకూలంగా ఉండి, సర్పంచ్ అభ్యర్థిపై నిరుత్సాహంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వార్డు సభ్యుల అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థికి నీయిష్టం... వార్డులో నాకు తప్పనిసరిగా ఓటు వేయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలావరకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.


