అందరికీ హామీ... ఓటెవరికి సామీ..?
అంతుచిక్కని ఓటర్ నాడి
జహీరాబాద్: ఓటు అడిగేందుకు ఇంటికి వస్తున్న అభ్యర్థులకు ఓటర్లు మాత్రం నిరాశ పర్చడం లేదు. అన్నా...తమ్మీ..అక్కా, చెల్లెమ్మా మా ఓటు మీకే అంటూ ఓటర్లు హామీ ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు ఓటర్లు ఏ మాత్రం నిరుత్సాహ పర్చడం లేదు. మీకు కాకుంటే ఇంకా ఎవరికేస్తాం చెప్పు అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఏ అభ్యర్థి ప్రచారానికి వెళ్లినా ఓటర్ల నుంచి మాత్రం ఇదే సమాధానం వస్తోంది. దీంతో అభ్యర్థులు గాలిలో తేలిపోతున్నారు. ఓటు కోసం ఇంత బతిమాలడం ఎందుకన్నా మా ఇంటోళ్ల ఓట్లన్నీ నీకే పడతాయని అభ్యర్థులందరికీ ఇదే మాట చెబుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడత పూర్తి కాగా ఇంకా రెండో, మూడో విడత ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓటు కోసం అభ్యర్థులు తామే స్వయంగా అడగడమే కాకుండా ఫలానా ఓటర్లు ఎవరితో సఖ్యతగా ఉంటారనే విషయమై వివరాలు సేకరించుకుని వారి ద్వారా కూడా ఓటు వేయించుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు కోసం ఒక్కో ఓటు కీలకం కావడంతో ఏ ఒక్క అవకాశం కూడా చేజారకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు మీకు సేవలందిస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. యువత, మహిళల ఓటు చేజారకుండా ఉండేందుకు నామినేషన్ల దాఖలు నుంచి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఓటనే నాడి అర్థం కాక అభ్యర్థులు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. బ్యాలెట్‌పై ఓటు వేసే చివరి నిమిషం వరకు ఓటర్లు మాత్రం ఎవరికి ఓటు వేస్తారో అనే విషయం ఎవరికీ అంతుపట్టని పరిస్థితి ఉంది.


