ఓటింగ్‌కు దూరంగా ఉద్యోగులు
● పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అనాసక్తి ● గొడవలు జరుగుతాయన్న భయం
జహీరాబాద్‌టౌన్: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. ఓట్ల లెక్కింపు సమయంలో ఉద్యోగి ఎవరికి ఓటు వేశారనేది అభ్యర్థులకు తేలిగ్గా తెలిసిపోతుంది. దీంతో ఓడిన అభ్యర్థులతో గొవవలు జరుగుతాయని ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అకాశం ఉంది. శిక్షణ తరగతుల సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. గుర్తులపై టిక్ మార్కు చేసి ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఉన్న బాక్స్‌లో వేయాలి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో సదరు ఉద్యోగి ఎవరికి ఓటు వేశారనేది తెలిసిపోతుంది. దీంతో గ్రామాల్లో గొడవలెందుకనే ఉద్దేశ్యంతో ఓటుహక్కును వినియోగించు కోవడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పత్రాలను సంబంధిత డివిజన్ కేంద్రాలకు పంపుతారు. పంచాయతీ ఎన్నికలు వచ్చే సరికి బ్యాలెట్ పత్రాలను అధికారులు ఉద్యోగుల సొంత గ్రామాలకు పంపుతారు. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెల్లో ఏ వార్డులో ఎంత మంది.. ఎవరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనే విషయం స్థానికులకు కచ్చితంగా తెలుస్తుంది. దీంతో ఓట్ల లెక్కిపు సమయంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. కౌటింగ్ హాల్‌ల్లోని ఎజెంట్‌లకు ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చూపిస్తారు. తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఉద్యోగి ఓటు ఎవరికి వేశారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక వేళ అభ్యర్థి ఒక ఓటుతో గెలిస్తే గొడవలకు దారితీస్తుందన్న ఉద్దేశ్యంతో ఉద్యోగులు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ఆరు వేల మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్‌లు ఇవ్వగా 90 శాతం వరకు ఓటు వినియోగించుకోలేదని సమాచారం.
ఓటింగ్‌కు దూరంగా ఉద్యోగులు


