కిడ్నాప్ కాదు.. డ్రామా
● దోస్తుల కోసమే నాటకం ఆడాం
● స్వయంగా ఒప్పేసుకున్న విద్యార్థులు
● తల్లిదండ్రులకు అప్పగించిన ప్రిన్సిపాల్
మునిపల్లి(అందోల్): విద్యార్థులు ఆడిన కిడ్నాప్ డ్రామా అంతా అబద్ధమని ప్రిన్సిపాల్ సురభీ చైతన్య తెలిపారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులకు విద్యార్థులను అప్పగించారు. గ్రామంలో దోస్తులను కలిసేందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విద్యార్థులు రాకేశ్, సిద్దార్థ్ ఇద్దరూ ప్రిన్సిపాల్, ఎంపీడీఓ హరినందన్‌రావు, తల్లిదండ్రుల ముందు స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వీరిద్దరి కిడ్నాప్ నాటకంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారని ప్రిన్సిపాల్ ఆవేదన వ్యకం చేశారు. అయితే సోమవారం విద్యార్థులను తిరిగి హాస్టల్‌కు తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా.. మరోసారి కిడ్నాప్, డ్రామాలు ఆడితే మాకేం సంబంధం లేదని, స్వయంగా లెటర్ రాసివ్వాలని ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. కాగా, సీసీ పుటేజీల పరిశీలనతో పాటు వైద్యుల పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని డాక్టర్లు స్పష్టంగా చెప్పడంతో విద్యార్థులే కిడ్నాన్ డ్రామా ఆడినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరినందరావు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.


