పనిచేస్తారా? వెళ్లిపోతారా?
● ప్రతి రోజు 20 మంది డాక్టర్లు రావాల్సిందే
● డీసీహెచ్‌ఎస్ డాక్టర్ షరీఫ్ హెచ్చరిక
జోగిపేట(అందోల్): ప్రతి రోజు డాక్టర్లు సకాలంలో విధులకు హాజరుకావాలని, లేకుంటే చర్యలు తప్పవని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎండీ షరీఫ్ హెచ్చరించారు. బుధవారం జోగిపేట ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే విధులకు హాజరు కావడం 11 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో డీసీహెచ్‌ఎస్ వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పనిచేయాలనుకున్నారా..? వెళ్లిపోతారా? అంటూ గట్టిగానే మందలించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ ఇలాఖాలో ఆస్పత్రిలో పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సుమారు గంటన్నర సేపు డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ‘రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తించాలి.. మీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. సరిగా పనిచేయకపోతే మీ ఇష్టం’ అని చెప్పినట్లు తెలిసింది. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ప్రతి రోజు 22 మంది డాక్టర్లు విధుల్లో పాల్గొనాలని, సెలవుపై వెళితే ముందే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు అవుట్ పేషెంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రిలో మందుల కొరతలేదని, సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని డీసీహెచ్‌ఎస్ షరీఫ్ చెప్పారు.


