నకిలీ ఓట్ల నివారణ ఇలా.. !
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో నకిలీ ఓట్లు వేయకుండా అసలైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్పకుండా ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటు వేసిన వారు తిరిగి ఓటు వేయకుండా ఉండేందుకు వారి వేలుపై సిరాచుక్క వేయనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేని పక్షంలో ఓటరు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డులో చిన్న పొరపాట్లను పట్టించుకోవద్దని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతీ ఓటరు వేలికి సిరా చుక్క వేస్తారు. ఒక్కసారి ఓటు వేసిన ఓటరు మళ్లీ అదే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా నివారించేందుకు సిరాచుక్క వేస్తారు. ఓటు వేసిన ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు ఈ సిరాగుర్తు వేయనున్నారు. చూపుడువేలు లేని వారికి ఎడమచేతి మధ్యవేలికి వేస్తారు. ఆ వేలు కూడా లేనివారికి ఉంగరం వేలుకు, నాలుగు వేళ్లూ లేని పక్షంలో చిటికనవేలుకు.. ఎడమచేయి లేని వారికి కుడిచేయి చూపుడు వేలుకు వేస్తారు. ఆ వేలు లేనిపక్షంలో మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు ఉపయోగిస్తారు. రెండు చేతుల వేళ్లు లేనివారికి వేళ్ల మొదలు, మధ్య భాగంలో.. అసలు చేతులే లేని పక్షంలో ఎడమ చెంపకు సిరాగుర్తును పెట్టాలని ఈసీ నిర్ణయించింది.


