బస్సులో మరిచిపోయిన ఆభరణాలు
ప్రయాణికురాలికి అందజేసిన ఆర్టీసీ సిబ్బంది
కోహెడరూరల్(హుస్నాబాద్): ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన బంగారు పుస్తెలతాడును డ్రైవర్, కండక్టర్ బుధవారం బాధితురాలికి అందజేసి ఔదార్యం చాటుకున్నారు. వివరాలు ఇలా... హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం కోహెడ మీదుగా కరీంనగర్‌కు వెళ్తుంది. ఈ ట్రిప్పులో బస్సులో డ్రైవర్ ఉల్లి చంద్రమౌళి, కండక్టర్ కరుణ ఒక చిన్నపాటి పెట్టెను గమనించారు. దాన్ని తెరిచి చూడగా అందులో సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడు కనిపించింది. దీంతో సదరు నగలను ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వెంకటేశ్వర్‌కు అప్పగించారు. ఈ మార్గంలో ప్రయాణించిన వారిని విచారించగా వింపల్లికి చెందిన బద్దం లక్ష్మికి చెందిన ఆభరణాలని తెలిసింది. దీంతో బుధవారం వారిని హుస్నాబాద్ డిపోకు రప్పించి.. అధికారుల సమక్షంలో ఆభరణాలు అప్పగించారు. పోయిన సొమ్మును భద్రంగా ప్రయాణికురాలికి అప్పగించిన కండక్టర్, డ్రైవర్‌ను పలువురు అభినందించారు.


