గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య
తూప్రాన్: చెత్త కాగితాలు ఏరుకోవడంలో ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవ హత్యకు దారితీసింది. ఈ సంఘటన పట్టణ పరిధి లింగారెడ్డిపేట చౌరస్తా ఆర్టీసీ బస్టాప్ వద్ద బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట గ్రామానికి చెందిన ర్యాపని హనుమంతు తూప్రాన్‌తో పాటు పరిసర గ్రామాల్లో చిత్తు కాగితాలు ఏరుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మరో గుర్తు తెలియని వ్యక్తి కొన్నాళ్లుగా ఇదే ప్రాంతంలో చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడు. హనుమంతు ఈ ప్రదేశాల్లో కాగితాలు ఏరొద్దని, ఇది నేను ఒక్కడినే ఏరుకుంటానని పలుమార్లు చెప్పాడు. అయినా సదరు వ్యక్తి తన మాటను లెక్కచేయకుండా కాగితాలు ఏరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే లింగారెడ్డిపేట చౌరస్తాలోని ఆర్టీసీ బస్టాప్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రిస్తున్నాడు. అక్కడికి చేరుకున్న హనుమంతు సదరు వ్యక్తిని చూసి కోపోద్రికుడై చేతులు కట్టేసి కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం అయింది. తాడుతో మెడకు బిగించి హత్య చేశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు గమనించి హనుమంతును ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చి ఆర్టీసీ బస్టాప్‌లో వ్యక్తిని గమనించగా మరణించి ఉన్నాడు. వెంటనే పోలీసులు హనుమంతును అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితుడు


