ఆడపిల్ల పెళ్లికి పుస్తె మెట్టెలు
నర్సాపూర్: గ్రామానికి చెందిన ఆడపిల్ల పెళ్లికి పుస్తెమెట్టెలు ఇస్తానని నర్సాపూర్ మండల పరిధి మంతూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే, గ్రామంలో ఆడపిల్ల పుడితే ఐదు వేల ఒక రూపాయలు బహుమతిగా ఇస్తానని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దుస్తులు అందచేస్తానని చెప్పారు. గ్రామమంతటా సీసీ కెమెరాలు అమరుస్తానని, ఇంటర్మీయెట్ చదివే యువతులకు రూ.20వేలు అందచేస్తానని, క్రికెట్, బాస్కెట్ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు ఐదు వేల రూపాయలు అందచేసి ఆదుకుంటామని హామీలు ఇస్తూ ప్రచారం చేపడుతున్నారు. అవసరమైతే తాను ఇస్తున్న హామీలు బాండ్ పేపరుపై రాసి ఇస్తానని ప్రకటించారు.
ఆడపిల్ల పుడితే రూ.5వేలు డిపాజిట్
గ్రామంలో ఆడపిల్ల పుట్టిన బాలిక పేరుపై రూ.ఐదు వేల ఫిక్స్ డిపాజిట్ చేస్తానని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పద్మాగౌడ్ హామీ ఇచ్చారు. గ్రామంలో పేదల ఇంటిలో ఎవరైనా మరణిస్తే ఐదు వేల ఆర్థిక సహాయం అందచేస్తానని, వైకుంఠ రథం తయారు చేయించి గ్రామానికి అందచేస్తానని హామీ ఇస్తున్నారు. గతంలో తాము చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ గిరిజన తండాల్లో మంచి నీటి సదుపాయం కల్పి స్తానని హామీలు ఇస్తూ పద్మాగౌడ్ ప్రచారం చేపడుతున్నారు.
ఆడపిల్ల పుడితే రూ. 2వేలు
గ్రామంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే రెండు వేల రూపాయలు బహుమతిగా అందచేస్తానని నర్సాపూర్ మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దశరథ్‌గౌడ్ హామీ ఇచ్చారు. గ్రామంలోని నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామస్తులందరికి ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందచేస్తానని, పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. గ్రామంలో విద్యాభివృద్ధి, గ్రామంలోని నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని దశరథ్‌గౌడ్ హామీలు ఇస్తూ ప్రచారం చేపడుతున్నారు.
ఆడపిల్ల పెళ్లికి పుస్తె మెట్టెలు
ఆడపిల్ల పెళ్లికి పుస్తె మెట్టెలు


