పోరాటాలకు సన్నద్ధం కావాలి
మెదక్ కలెక్టరేట్: రానున్న రోజుల్లో అత్యంత భయంకరమైన పరిస్థితులు రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం సన్నద్ధం కావాలని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపు నిచ్చారు. మంగళవారం మూడవ రోజు సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్ల ప్రమాదం గురించి ఎక్కడ బడితే అక్కడ, గ్రామాలు, పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం అత్యంత దూకుడుగా ఆ కోడ్లను అమలు చేసేందుకు ముందుకువస్తుందని, వాటిని తిప్పి కొట్టేందుకు అదే తరహాలో పోరాటాలను పెంచాలని సూచించారు. ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. విద్యుత్ బిల్లు వల్ల కార్మికులకే కాదు. కర్షకులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక మైత్రితో నిర్వహించే పోరాటాలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్, కోశాధికారిగా వంగూరి రాములు శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇందులో ఆఫీసు బేరర్లుగా 31మందిని ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు వీరయ్య, సుధాభాస్కర్, భూపాల్, ఎస్వీ రమ, కల్యాణం వెంకటేశ్వరరావు, వీరారెడ్డి, జయలక్ష్మి, మల్లిఖార్జున్, వీఎస్ రావు, ఈశ్వరరావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 139 మంది రాష్ట్ర కౌన్సిల్, 103 వర్కింగ్ కమిటీ సభ్యులను సైతం ఎన్నుకున్నారు.
అత్యంత భయంకర పరిస్థితులు రాబోతున్నాయి
సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్
ముగిసిన రాష్ట్ర ఐదో మహాసభలు


