పైలెట్ గ్రామాల్లో ప్రగతి అంతంతే..
1,342 మందికి
ఇందిరమ్మ గృహాలు మంజూరు
ఏడాదవుతున్నా
ప్రారంభం కాని సగం ఇళ్లు
మండలానికి ఒకటి చొప్పున 25 గ్రామాల ఎంపిక
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. ఈ గ్రామాల్లో ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో సగం మంది కూడా ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోకపోవడం గమనార్హం. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున 25 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఒక్క పూరి గుడిసె కూడా ఉండకూడదనే లక్ష్యంతో గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 25 గ్రామాల్లో మొత్తం 1,342 గృహాలు మంజూరయ్యాయి. ఇవి మంజూరై దాదాపు ఏడాది దగ్గర పడుతున్నప్పటికీ ఇందులో సుమారు 700 మంది తమ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోయలేదు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకున్న లబ్ధిదారుల్లో చాలా ఇళ్లు బేస్‌మేట్, గొడల స్థాయికే పరిమితమయ్యాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాని గ్రామాల్లో చాలా మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు. ఇంటి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ గృహాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వీరికి ఇళ్లు మంజూరు కావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే రెండో విడతలో మంజూరు చేస్తామని చెబుతున్నారు. దీంతో కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న గ్రామాల్లో ఇళ్లు మంజూరు కాలేక, మంజూరైన గ్రామాల్లో ఇంటి నిర్మాణం ప్రారంభం కాలేని పరిస్థితి నెలకొంది. పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో నిర్మాణం ప్రారంభం కాని గృహాలను ఇతర గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు మార్చాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనేక కారణాలు
పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిల్లులు రావనే భయంతో చాలా మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల ఇసుక లభించకపోవడంతో ఇంటికి ముగ్గు పోసుకోలేదు. పెరిగిన ఇసుక ధరలకు ప్రభుత్వం ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోవనే కారణంగా కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను షురూ చేయలేదు. మరోవైపు పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలతో కూడా లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


