గూడెం.. ఎందుకు దూరం..?
● పంచాయతీ ఎన్నికల ప్రచారం చేయని ఎమ్మెల్యే ● పటాన్‌చెరులో కాంగ్రెస్ కార్యకర్తలకు వింత పరిస్థితి ● ఎమ్మెల్యే మద్దతు మాకే అంటూ బీఆర్‌ఎస్ ప్రచారం ● కనిపించని కాంగ్రెస్ నేతలు కాటా, నీలం
పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలెవరూ పంచాయతీ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తిరగడం లేదు. అలాగని ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న వారు తాము కాంగ్రెస్‌లో ఉన్నామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ ఒంటెత్తు పోకడలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు ఎవరనేది ప్రశార్థకంగా మారింది. ఆయన కనీసం ఫోన్‌లలో కూడా సాధారణ కార్యకర్తకు అందుబాటులో ఉండరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్‌కు భిన్న సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నియోజకవర్గంలో పటాన్‌చెరు మండలంలో మూడు గ్రామాలు, గుమ్మడిదల మండలంలో ఏడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలోనే పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ప్రచార పర్వానికి తెర పడింది. కాంగ్రెస్ పెద్ద నేతలెవరూ ఏ గ్రామంలోనూ ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ ఇప్పటికే ప్రజలకు చాలా దూరంగా ఉన్నారని కనీసం ఆయన ఫోన్‌లో కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే చెప్పాలి. కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన నీలం మధు కూడా ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఏ పార్టీలో కొనసాగుతున్నానే దానిపై నేటికీ స్పష్టత నివ్వని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా ఈ ఎన్నికల పంచాయతీకి దూరంగానే ఉన్నారు. ఆయన గ్రామ స్థాయిలో ముఖ్య నేతలకే సర్పంచ్‌ల ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. బీజేపీ నేత ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఆదర్శ్‌రెడ్డి మాత్రం అలా ఒక రౌండ్ వేసి తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయాలని తూతూ మంత్రంగా ప్రచారం చేశారు.
గుర్తులతో పనేముంది..?
పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ నుంచి ఎవరూ టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో గెలిచిన సర్పంచ్‌లను తమ దార్లోకి తెచ్చుకోవాలనే ఎత్తుగడ అధికార పార్టీలో ఉన్నట్లు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పెద్దలెవరూ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని తెలుస్తుంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనే ప్రశ్న పటాన్‌చెరు ప్రజలెవరూ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అయితే మండల పరిధిలోని నందిగామలో ఓ అభ్యర్థి మాత్రం బీఆర్‌ఎస్ ఫ్లెక్సితో ఏర్పాటు చేసుకున్న ప్రచార రథంపై కేసీఆర్‌తో, పాటు స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుని ‘‘అన్న నా వెంటే ’’ఉన్నారంటూ ఎక్కడ చెప్పకుండా ప్రచారం చేసుకుంటున్నారు.


