చలి పంజా
సంగారెడ్డి జోన్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో 6.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే.. అనేక మండలాలలో కూడా సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్నాయి. దీంతో పలు మండలాల్లో ఆరెంజ్ జోన్‌గా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కోహీర్‌లో 6.6, న్యాల్‌కల్ 7.5, ఝరాసంగం, మొగుడంపల్లి 7.6, జహీరాబాద్, గుమ్మడిదల, నిజాంపేట్‌లలో 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపశమనం పొందేందుకు చలి మంటలు కాపుతూ, స్వెటర్లు, చేతులకు హ్యాండ్ గ్లౌజులు, మప్లర్లు ధరిస్తున్నారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
సుమారు 10–15 సంవత్సరాల తర్వాత అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరో వారం పది రోజుల పాటు చలి తీవ్రత పెరిగే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అధిక వర్షాలే చలి తీవ్రతకు కారణం
ఈ సంవత్సరం వానకాలం సీజన్ లో కురిసిన అధిక వర్షాలే చలి తీవ్రతకు కారణం అని తెలుస్తుంది. ఇప్పటికీ చాలాచోట్ల వాగులలో వరద నీరు ప్రవహిస్తుంది. నీటి కుంటలు, చెరువులలో నీరు పుష్కలంగా ఉంది. ఏది ఏమైనా మరికొన్ని రోజులు చలి నుండి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
కోహీర్‌లో 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
జిల్లాలో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదు
పలు మండలాలకు ఆరెంజ్ జోన్


