మింగలేక
అప్పులు తెచ్చి పంచాయతీఎన్నికల ఖర్చు పెట్టిన ఖర్చులు ఎప్పుడొస్తాయోననిఆందోళన ఇబ్బందులు పడుతున్న కార్యదర్శులు
కక్కలేక..
కార్యదర్శులకు భారంగా మారిన ఎన్నికలు
దుబ్బాక : పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి గోరుచుట్టపై రోకలి పోటులా తయారైంది. అసలే రెండేళ్లుగా సర్పంచ్‌లు లేక గ్రామాల్లో సర్వం సెక్రటరీలే చూసుకుంటున్నారు. డ్రైనేజీల శుభ్రం, రోడ్లు, ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు గ్రామాల్లో మౌళిక సమస్యలను వారే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్రామాల్లో అప్పులు తెచ్చి పెట్టిన పాత ఖర్చుల బిల్లులే పూర్తిగా రాక సతమతమవుతున్న తరుణంలో సెక్రటరీలకు ఈ పంచాయతీ ఎన్నికలు తీవ్ర తలనొప్పిగా మారాయి.
మోయలేని భారం..
పంచాయతీ ఎన్నికలు సెక్రటరీలకు.. కరిస్తే కప్పకు కోపం, కరవకుంటే పాముకు కోపం అన్నట్లుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల ఖర్చు అంతా పంచాయతీ సెక్రటరీపై పడటంతో మోయలేని భారంతో ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్‌ల నామినేషన్ల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు ఖర్చులన్నీ సెక్రటరీలే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ల తరుణంలో టెంట్లు, అధికారులకు అన్ని సౌకర్యాలతో పాటు ఎన్నికలకు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో కరెంట్, మంచినీళ్లు, టాయిలెట్స్, ఎన్నికల సిబ్బందికి భోజనాలు, ఇతర సౌకర్యాలు వారే చూసుకోవాల్సిన పరిస్థితి. కక్కలేక మింగలేక.. ఆర్థిక భారంతో సెక్రటరీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఒక్కో సెక్రటరీ తక్కువలో తక్కువ రూ.30 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు పెట్టగా, ఇంకా ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎన్ని పెట్టాల్సి వస్తుందోనంటూ తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో 508 గ్రామాలు..
జిల్లాలో 508 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. మొదటి విడతలో జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో 146 గ్రామాలు, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో 25, రాయపోల్ మండలంలో 19 గ్రామాలు.. మొత్తం 7 మండలాల్లోని 190 గ్రామాలకు 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 174 గ్రామాల్లో 1432 వార్డులకు ఈ నెల 11 న పోలింగ్ జరగనుంది. అలాగే రెండో విడతలో 10 గ్రామాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 182 గ్రామాలు, 1,644 వార్డులకు ఈ నెల 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మిగిలిన గ్రామాల్లో 3వ విడతలో 17న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ఖర్చులు పంచాయతీ సెక్రటరీలకు తలనొప్పిగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వస్తాయో..రావో!
ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల్లో అప్పులు తెచ్చి ఖర్చులు పెడుతున్నాం. ఈ డబ్బులు మాకు తిరిగి వస్తాయో రావో దేవుడెరుగు అంటూ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పుల పాలయ్యాం.. మళ్లీ ఈ ఎన్నికలు మాకు ఇంకా గుదిబండగా మారాయని పంచాయతీ సెక్రటరీలు చేతులు జోడించి ఈ కొలువులు చేయడం కష్టమేనంటూ తమ గోడు ఎవరు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కార్యదర్శులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో పోలింగ్ బూత్‌లలో మౌలిక సదుపాయాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యదర్శులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం.
– భాస్కర శర్మ, ఎంపీడీవో
మింగలేక


