నవోదయకు సర్వం సిద్ధం
13న ప్రవేశ పరీక్ష
● నేడు సీఎస్, సీఎల్‌ఓలకు శిక్షణ ● వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ వెల్లడి
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లాలో నవోదయ ఎంపిక పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026–27 విద్యాసంవత్సరానికి గాను వర్గల్ నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఎంట్రెన్స్ పరీక్ష (జెఎన్‌వీఎస్‌టీ) జరుగుతుంది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,754 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష నిర్వహణకు 22 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన పరీక్షకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖాధికారుల సమక్షంలో ఆయా జిల్లా కేంద్రాల్లో సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవెల్ అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుదన్నారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అనుమానాల నివృత్తికి 73823 35164, 94489 01318 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


