52 మంది బైండోవర్
కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మండలంలోని 52 మందిని సోమవారం బైండోవర్ చేసినట్టు ఎస్‌ఐ మహేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరైనా ఎన్నికల ప్రకియలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా, వివాదాలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు పటిస్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
17 మందికి జరిమాన
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... శనివారం, ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో పలు చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఐదుగురికి రూ.1500, మిగతా 12 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించారు.
సిద్దిపేటలో 10 మందికి..
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 10మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.1,02,000 జరిమాన, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు.
పాము కాటుతో రైతు మృతి
చేగుంట(తూప్రాన్): పాముకాటుకు గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దొంతి ఆంజనేయులు వ్యయసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం వ్యవసాయ పొలం వద్ద పాము కాటు వేయగా అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
లారీ డ్రైవర్, క్లీనర్ రిమాండ్
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని జిల్లెలగడ్డ చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన డ్రైవర్, క్లినర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి సోమవారం తెలిపారు. హన్మకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లారీ డ్రైవర్ అంకుస్‌సింగ్, క్లినర్ యూసుఫ్‌లు మద్యం తాగి పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.
విత్తన సవరణ బిల్లురద్దు చేయాలి
వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాల నిరసన
మెదక్ కలెక్టరేట్: విత్తన సవరణ బిల్లును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ గోదాం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న నిర్ణయించిన సీడ్స్ బిల్ 2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది భారత విత్తన రంగంపై బహుళజాతి కార్పొరేట్ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి తీసుకొచ్చిన ప్రతికూల చట్టమన్నారు. ఇది ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.మల్లేశం, రైతు సంఘం గౌరయ్య, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.


