డబ్బు, మద్యం పంపిణీ..
● ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సర్పంచ్ అభ్యర్థులు, 68 మందిపై కేసు
సిద్దిపేటఅర్బన్: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేసిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులపై సిద్దిపేట త్రీటౌన్‌లో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎన్సాన్‌పల్లి సర్పంచ్ అభ్యర్థి నాగుల స్రవంతి గ్రామంలోని ఓ కుల దైవం గుడి వద్ద అదే కులానికి చెందిన 44 మందికి మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్‌చార్జి వంశీకృష్ణ తన సిబ్బందితో కలిసి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన 68 రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిల్స్, 39 మోటార్ సైకిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి నాగుల స్రవంతితో పాటు మరో 44 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే మిట్టపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చింతల కుమార్ తన ఇంటి వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ సురేశ్ సిబ్బందితో వెళ్లారు. పోలీసులను గమనించి డబ్బులను పక్క ఇంట్లోకి విసిరేశారు. విసిరేసిన రూ. 25,500ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి చింతల కుమార్‌తో పాటు చింతల రాజుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
అయినాపూర్‌లో 24 మందిపై కేసు
కొమురవెల్లి(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పంపిణీ చేస్తున్న వారిపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మండలంలోని అయినాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్ వివరాల ప్రకారం... సోమవారం సాయంత్రం గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొంతమంది మద్యం పంపిణీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు మద్యం పంపిణీ చేస్తున్న 24 మందిపట్టుకుని కేసు సమాదు చేశారు. అలాగే ఘటనా స్థలంలో పంపిణీ కోసం ఉంచిన 24 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.


