అక్రమ మద్యం స్వాధీనం
వట్‌పల్లి(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ తెలిపిన వివరాలు... పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వట్‌పల్లి నుంచి మండలంలోని పోతులబోగుడా గ్రామానికి చెందిన ముద్దాపురం ప్రవీణ్ కారులో అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా 480 లిక్కరు బాటిల్స్, 48 బీరు బాటిళ్లను పట్టుకున్నారు. పట్టు బడిన మద్యం విలువ రూ.1,02,840 ఉంటుందని తెలిపారు. తరలిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా 98 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లవకుమార్, ఏఎస్‌ఐ సుధాకర్, కానిస్టేబుల్స్ భూమయ్య, రాజు, గీత పాల్గొన్నారు.
కొల్చారంలో 95 లీటర్లు..
కొల్చారం(నర్సాపూర్): అక్రమంగా తరలిస్తున్న 95 లీటర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ అహ్మద్ మొహీనుద్దిన్ వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి శివారులో ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పాపన్నపేట మండలం నాగ్సానిపల్లికి చెందిన బాలి జగదీష్ కారులో తరలిస్తున్న 47 లీటర్లు, జయపురం గ్రామానికి చెందిన శ్రీశైలం టీవీఎస్ ఎక్సెల్‌పై తరలిస్తున్న 25 లీటర్లు, ఎన్కేపల్లికి చెందిన చాంద్‌పాషా ఆటోలో తరలిస్తున్న 24 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సిద్దిపేట పట్టణంలో..
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్‌ను విచారించగా రేగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జింగిలి లక్ష్మి, ఆమె అల్లుడైన కుంభం శ్రీకాంత్ సూచనల మేరకు పట్టణంలోని కనకదుర్గ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి ఆటోలో ఊరికి తరలిస్తున్నట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఆటోలో తరలిస్తున్న రూ.80వేల విలువైన బీర్లు, లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేసినట్లు టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


