నమూనా బ్యాలెట్‌లో తిరకాసు
సర్పంచ్ అభ్యర్థి పరేషాన్
పాపన్నపేట(మెదక్): నమూనా బ్యాలెట్ ప్రింటింగ్‌లో జరిగిన పొరపాటు..అభ్యర్థి కొంప ముంచింది. మండల పరిధిలోని గాజులగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఆమెకు కత్తెర గుర్తును అధికారులు కేటాయించారు. అయితే ప్రచారంలో భాగంగా ప్రింటింగ్ చేయించిన నమూనా బ్యాలెట్‌లో పైన కత్తెర గుర్తు సరిగానే ప్రింట్ అయింది. కానీ కింద తన ప్రత్యర్థికి చెందిన ‘బ్యాట్ గుర్తుకే మన ఓటు’అని అచ్చు వేశారు. ఇది చూసిన ఓటర్లు ఇదేంటబ్బా అని ముక్కున వేలేసుకున్నారు. గమనించని సదరు అభ్యర్థి అప్పటికే కొన్ని నమూనా బ్యాలెట్‌లు పంచి, తర్వాత తప్పును గుర్తించారు. వాటిని తిరిగి వాపస్ తీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కల్వర్టును ఢీకొట్టి..యువకుడు మృతి
భార్యను అత్తారింట్లో
వదిలి వస్తుండగా ప్రమాదం
కొండపాక(గజ్వేల్): భార్యను రెండో కాన్పు కోసం అత్తారింట్లో వదిలి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... తొగుట మండలం లక్మాపూర్ గ్రామం కాగా... గజ్వేల్ మండలంలోని ముట్రాజ్‌పల్లి శివారులో డబుల్ బెడ్రూమ్‌లో పుంటికూర కర్ణాకర్ (28) నివాసం ఉంటున్నారు. కాగా భార్య అఖిల రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి కరుణాకర్‌తోపాటు తల్లి మల్లవ్వతో కలిసి కొండపాక మండలంలోని అత్తగారి ఊరు ఖమ్మంపల్లికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరుసకు బామ్మర్ది శివతో కలిసి లక్ష్మాపూర్‌కు బయలు దేరారు. మార్గమధ్యలో నిద్ర రావడంతో కొండపాక గ్రామ క్రాస్ రోడ్డు వద్ద కొద్దిసేపు కారును ఆపి పడుకున్నారు. కొద్దిసేపటి తరువాత వస్తూ.. రాంచంద్రాపూర్ గ్రామ శివారులోని రాజీవ్ రహదారి ప్రక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలై కర్నాకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుని తండ్రి చంద్రయ్యకు శివ సమాచారం ఇచ్చాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


