ఓటరు జాబితా తప్పుల తడక
అల్పాహారం మొదలుకొనిరాత్రి భోజనం వరకు ఒకరికి మించి ఒకరు ఖర్చు చేస్తున్న అభ్యర్థులు
సంగారెడ్డి టౌన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారం గడువు దగ్గర పడటంతో గ్రామాలతోపాటు , పట్టణాల్లో నివసించే ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ప్రచారంతో సందడిగా కనిపిస్తుంది. ప్రచారంలో తమ వెంట పాల్గొనే వారితో పాటు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ఉదయం టిఫిన్ మొదలుకుని, మధ్యాహ్నం, రాత్రి మాంసంతో భోజనం, మూడు ఫూటల మందు వరకు అన్ని అభ్యర్థులే సమకూరుస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల జోరు కనిపిస్తున్నది. సర్పంచ్ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపు యజమానులకు, చికెన్ అమ్ముతున్న దుకాణదారులకు మస్తు గిరాకీ ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే నిబంధనలకు విరుద్ధంగా చీరలతో పాటు వంట సామగ్రి పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లతోపాటు వెంట తిరిగే క్యాడర్‌కు ఒకరికి మించి ఒకరు ఖర్చు చేస్తున్నారు.
గ్రామాల్లో ప్రచార జోరు


