పల్లె పోరు.. ప్రింటింగ్ జోరు
ఫ్లెక్సీ, ప్రింటింగ్ షాపులకు గిరాకీ
● జోరందుకున్న ప్రచారం ● గోడ పత్రికలు, కండువాలు ప్రచురణ
దుబ్బాకటౌన్: పల్లె పోరు ఊపందుకుంది. రెండో దశలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల విత్ డ్రా ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు సైతం కేటాయించడంతో గోడ పత్రికలు, కండువాలు, కర పత్రాల కోసం ఫ్లెక్సీ, ప్రింటింగ్ షాపులకు క్యూ కడుతున్నారు. నిన్న, మొన్న పెళ్లి గిరాకీ లేక వెలవెల బోయిన ఫ్లెక్సీ షాపులు ఎన్నికల నేపథ్యంలో ప్రచార సామగ్రి అమ్మకాలతో రద్దీగా మారాయి.
సోషల్ మీడియా సందేశాలకు ప్రత్యేక డిజైన్లు
ఓ వైపు ఉదయం లేవగానే ఇంటింటా తిరుగుతూ...ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న అభ్యర్థులు మరో వైపు సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశాలతో దూసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సందేశాలతో ఆకట్టుకునేలా ఫ్లెక్సీ షాపులలో డిజైన్‌లు చేయించి వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు, స్టేటస్‌లు పెడుతున్నారు. దీంతో డిజైనింగ్‌లో సైతం ఫ్లెక్సీ షాపులు బిజీ అవుతున్నాయి.


