పట్టా ఇచ్చారు.. భూమి మరిచారు
భూమి అప్పగించాలని బాధితుడి ఆవేదన
నారాయణఖేడ్: ఇరవై ఐదు ఏళ్ల కింద సిర్గాపూర్ శివారులో రెండెకరాల భూమిని పంపిణీ చేసి, అందుకు సంబంధించిన పట్టా పాసుపుస్తకం అందజేశారని.. కానీ ఇప్పటికీ భూమిని చూపలేదని సిర్గాపూర్‌కు చెందిన అమీనాబీ షేక్ మహబూబ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం ఖేడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో పట్టా పాసుపుస్తకం ఇవ్వగా ధరణి అందుబాటులోకి వచ్చాక కొత్త పాసుపుస్తకాలు సైతం అందజేశారని తెలిపారు. తనకు కేటాయించిన భూమిని చూపాలంటూ 25 ఏళ్లుగా అనేకమార్లు, స్థానిక, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వగా గతంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 18 ఎకరాల్లో సర్వే నిర్వహించి మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గుర్తించారని చెప్పారు. కానీ హద్దులు చూపిస్తామని చెప్పి అప్పగించడం లేదన్నారు. పట్టా పాసుపుస్తకాలు, ఇప్పటివరకు అందజేసిన వినతిపత్రాల ప్రతులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఖేడ్ సబ్‌కలెక్టరు, కలెక్టర్‌కు పంపినట్లు వివరించారు. నెల రోజుల్లో న్యాయం చేయని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.


