రేషన్ బియ్యం లారీ పట్టివేత
● 300 క్వింటాళ్లుగా గుర్తించిన విజిలెన్స్‌అధికారులు
● నెల రోజుల వ్యవధిలో మూడోసారి
తూప్రాన్: రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ లారీని అధికారులు సీజ్ చేశారు. సివిల్ సప్‌లై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు శుక్రవారం తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం కలిగిన లారీని పట్టుకున్నారు. వరుసగా రెండో రోజు రేషన్ బియ్య పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నెల రోజుల వ్యవధిలో మూడు లారీల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం విశేషం. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నుంచి గుజరాత్‌కు 300.90 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ శివానందం, సివిల్ సప్లయ్ రాష్ట్ర విజిలెన్స్ డీఎస్పీ రమేశ్‌రెడ్డి, సీఐ అజయ్‌బాబు, ఇన్‌స్పెక్టర్ నర్సింహులు ఆధ్వర్యంలో తూప్రాన్ బైపాస్ మార్గంలో వెళ్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంగా గుర్తించారు. డ్రైవర్ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.


