అదృశ్యమై.. శవమై..
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
వెల్దుర్తి(తూప్రాన్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన మండలంలోని మెల్లూర్ పంచాయతీ పరిధి పెద్దాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దాసరి నర్సమ్మ(38) సత్తయ్యలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఇంట్లో జరిగిన గొడవలతో ఈ నెల 3న ఉదయం నర్సమ్మ బయటకు వెళ్లింది. రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికి శుక్రవారం మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో సాయంత్రం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో పశువులకాపర్లు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు చెప్పారు. కాగా మృతురాలు నర్సమ్మగా గుర్తించారు. మృతురాలి మెడకు తాడు బిగించి ఉండటంతో హత్యకు గురికావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్‌ఐ రాజు పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


