ఖర్చులేని ప్రచారం
ప్రచార సాధనాలుగా వాట్సాప్ గ్రూపులు
జహీరాబాద్ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా ద్వారా ఖర్చు లేకుండా వీడియోలు, ఫొటోలను పోస్టు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. చాలా పల్లెల్లో ఇప్పటికే గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. సర్పంచ్‌గా గెలిస్తే గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి గురించి అందులో వివరిస్తున్నారు. కొంత మంది ఇంతకుముందు చేపట్టిన ప్రగతి పనుల వీడియోలను షేర్ చేస్తున్నారు. గతంలో చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను సైతం గ్రూపులో పెడుతున్నారు. రోజువారీ ప్రచారం కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నారు. చేపట్టిన అభివృద్ధి పనుల వీడియోలు కూడా పెడుతున్నారు. తనను గెలిపించాలని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ హామీలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళా వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచారం ఖర్చులేకుండా జోరుగా సాగుతుంది.


