చెరుకు దిగుబడులు అంతంతే!
జహీరాబాద్: చెరకు పంట దిగుబడులు ఆశించిన మేర రాక పోవడం రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వస్తోందని, దిగుబడులు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఎకరానికి చెరకు పంట ల్యాప (మొదటి పంట) 45 నుంచి 55 టన్నులు, మోడెం (రెండోపంట) 35 నుంచి 45 టన్నుల మేర దిగుబడులు వస్తేనే గిట్టుబాటవుతుందని రైతులు పేర్కొంటున్నారు. చెరకు పంట నాటి నప్పటి నుంచి కోత వరకు దుక్కి దున్నడం, ఎరువులు, నీటి తడులు అందించడం, కట్టుకట్టడం, మినీ ట్రాక్టర్‌తో బోదెలు తీసి అంతర కృషి చేయడం, కోత కోయడం తదితర ఖర్చులు అధికం అవుతున్నాయని రైతులు అంటున్నారు. చేతికి వచ్చిన పంటలో 30 శాతానికి పైగా చెరకు కోత, రవాణా కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. దుక్కి దున్నకం నుంచి కోతవరకు 40 శాతం మేర పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. దీంతో చెరకు పంట ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొదటి పంట 36 టన్నులు, రెండో పంట 28 టన్నుల మేర సగటు దిగుబడులు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత మంది రైతులు కేవలం 25 టన్నుల దిగుబడులు మాత్రమే సాధిస్తుండగా కొందరు రైతులు 50 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు. ఏడాది పొడువున ఒకటే పంట వస్తోందని, స్వల్ప కాలిక పంటలు అయితే మూడు పంటలు తీసుకునే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో 14 నెలల వరకు కూడ చెరకు కోత కోయడం సాధ్యం కావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరకు పంట ఏ మాత్రం గిట్టుబాటుగా లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి–గంగా కర్మాగారం టన్నుకు రూ.3,800 ధరను పక్రటించించగా, గణపతి కర్మాగారం రూ.3,826.20, మాగిలోని కర్మాగారం 3,726 ధరను ప్రకటించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అధిక పెట్టుబడులు అవుతున్నందున టన్నుకు రూ.5వేలు ధర ఉంటేనే గిట్టుబాటవుతుందంటున్నారు.
అధిక వర్షాలు దిగుబడులపై ప్రభావం
ఈ ఏడాది అధిక వర్షాలు కురియడం వల్ల చెరకు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెరకు గడల మధ్యలో బెండు(సొట్ట) ఏర్పడిందని, దీంతో చెరకు బరువు రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అధిక వర్షాల వల్ల భూముల్లో నీరు నిల్వ ఉండి దిగుబడులు పడిపోయేందుకు కారణంగా చెబుతున్నారు. జహీరాబాద్ నియోజకరవర్గంలో 9లక్షల టన్నుల చెరకు పంట ఉన్నట్లు, అందులో సగం పంట 25 టన్నుల దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
అధిక వర్షాలే కారణం
సగటులో ల్యాప ఎకరాకు
36 టన్నులు, మోడెం 28 టన్నులు
గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు


